||సుందరకాండ ||

||ఎబది ఆరవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 56 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ షట్పంచాశస్సర్గః||

శ్లో|| తతస్తు శింశుపామూలే జానకీం పర్యుపస్థితామ్|
అభివాద్యాబ్రవీ ద్దిష్ట్యా పశ్యామి త్వామిహాక్షతామ్||1||

స|| తతః శింశుపామూలే పర్యుపస్థితాం జానకీం అభివాద్య బ్రవీత్ | దిష్ట్యా త్వాం అక్షతాం ఇహ పశ్యామి||

తా|| అప్పుడు శింశుపావృక్షమూలములో ఉపస్థితురాలైవున్న జానకికి అభివాదము చేసి ఇట్లు పలికెను. ' అమ్మా అదృష్టము కొలదీ నిన్ను క్షేమముగా ఇక్కడ చూచుచున్నాను'.

శ్లో|| తతస్తం ప్రస్థితం సీతా వీక్షమాణా పునః పునః|
భర్తృస్నేహాన్వితం వాక్యం హనుమంతం అభాషత||2||
కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే|
పర్యాప్తః పరవీరఘ్నః యశస్యః తే బలోదయః||3||
శరైస్తు సంకులాం కృత్వా లంకామ్ పరబలార్దనః|
మాం నయేద్యది కాకుత్‍స్థః తత్ తస్య సదృశం భవేత్||4||
తద్యథా తస్య విక్రాన్తమనురూపం మహాత్మనః|
భవత్యాహవశూరస్య తథా త్వముపపాదయ||5||

స|| తతః ప్రస్థితం హనుమంతం వీక్షమాణా సీతా భర్తృస్నేహాన్వితం వాక్యం అభాషత||అస్య కార్యస్య పరిసాధనే కామం త్వం ఏకం ఏవ పర్యాప్తః | అస్య తే బలో దయః యశస్యః || పరబలార్దనః కాకుత్‍స్థః శరైస్తు లంకాం సంకులాం కృత్వా యది మాం నయేత్ తత్ తస్య సదృశం భవేత్ ||తత్ మహాత్మనః ఆహవశూరస్య తస్య విక్రాంతం అనురూపం యథా భవతి తథా త్వం ఉపపాదయ ||

తా|| అప్పుడు బయలుదేరుటకు సిద్ధముగా నున్న హనుమంతుని చూచుచూ, సీత భర్తపై తనకు గల స్నేహము ఉట్టిపడేటటట్టు గా ఇలా పలికెను. 'ఈ కార్యము సాధించుటలో బహుశ నీవు ఒక్కడివే చాలును. అలాచేసినచో నీ బలములు కీర్తి పెరుగును. పరశత్రువుల చీల్చి చెండాడగల రాముడు సమస్త లంకానగరమును సంకులము చేసి నన్ను తీసుకు పోయినచో అది ఆయనకు తగినట్లు ఉండును. అ మహాత్ముడు తన పరాక్రమమునకు అనుగుణమైన తీరుగా ఎట్లు చేయువలెనో దానికి తగు రీతిగా నీవు సూచనలు ఇమ్ము'.

శ్లో|| తదర్థోపహితం వాక్యం ప్రశ్రితం హేతుసంహితమ్|
నిశమ్య హనుమాంస్తస్యా వాక్య ముత్తరమబ్రవీత్||6||

స|| హనుమాన్ ప్రశ్రితం తత్ హేతుసంహితం అర్థోపహితం తస్యాః వాక్యం నిశమ్య హనుమాన్ వాక్యం ఉత్తరం అబ్రవీత్ |

తా|| అప్పుడు సీతాదేవిచే పలకబడిన అర్థవంతముగా వున్న హేతువులతో కూడి యున్న వచనములను విని హనుమంతుడు ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చెను.

శ్లో|| క్షిప్రమేష్యతి కాకు‍త్‍స్థో హర్యృక్షప్రవరైర్వృతః|
యస్తే యుధి విజిత్యారీన్ శోకం వ్యపనయిష్యతి||7||
ఏవమాశ్వాస్య వైదేహీం హనుమాన్ మారుతాత్మజః|
గమనాయ మతిం కృత్వా వైదేహీం అభ్యవాదయత్||8||
తతస్స కపిశార్దూలః స్వామిసందర్శనోత్సుకః|
ఆరురోహ గిరిశ్రేష్ఠం అరిష్ఠం అరిమర్దనః||9||

స|| కాకుత్‍స్థః హర్యక్షు ప్రవరైః వృతః క్షిప్రం ఏష్యతి | యః యుధి అరీన్ విజిత్య తే శోకమ్ వ్యపనయిష్యతి ||వైదేహీం ఏవం అశ్వాస్య హనుమాన్ మారుతాత్మజః గమనాయ మతిం కృత్వా వైదేహీం అభ్యవాదయత్ || తతః కపిశార్దూలః స్వామిసందర్శనోత్సుకః అరిష్ఠం గిరిశ్రేష్ఠం అరిమర్దనః ఆరురోహ ||

తా|| 'అమ్మా! కాకుత్‍స్థుడు వానర భల్లూక సేనలతో త్వరలో వచ్చును. యుద్ధములో శత్రువులను జయించి నీ శోకమును తీర్చును'. వైదేహి కి ఈ విధముగా అశ్వాసనము ఇచ్చి హనుమంతుడు వెళ్ళుటకు నిశ్చయించుకొని వైదేహికి నమస్కరించెను. అప్పుడు ఆ కపిశార్దూలుడు స్వామి సందర్శనోత్సాహముతో గిరులలో శ్రేష్టుడైన అరిష్ఠ పర్వతమును ఎక్కెను.

శ్లో|| తుంగపద్మకజుష్టాభిః నీలాభిర్వనరాజిభిః|
సోత్తరీయమివాంభోదైః శృంగాంతరవిలమ్బిభిః||10||
బోధ్యమానమివ ప్రీత్యా దివాకరకరైః శుభైః|
ఉన్మిషన్తమివోద్దూతైః లోచనైరివ ధాతుభిః||11||

స|| తుంగపద్మకజుష్టాభిః నీలాభిః వనరాజిభిః శృంగాంతర విలమ్బిభిః అంబోధైః స ఉత్తరీయం ఇవ (అస్తి)|| శుభైః దివాకరకరైః ప్రీత్యా బోధ్యమానం ఇవ (అస్తి) ఉద్ధూతైః లోచనైరివ ధాతుభీ ఉన్మిషన్తం ఇవ ||

తా|| ఎత్తైన పద్మక వృక్షములున్న, నల్లని వనములతో కూడిన ఆ పర్వతము, శిఖరాలమధ్య వ్యాపించిన మేఘములతో ఉత్తరీయము ధరించినదా అన్నట్లు ఉండెను.శుభకరమైన దివాకర కిరణములు ప్రేమాస్పదముగా మేల్కొలపగా, పైకిలేచిన గైరికాది ధాతువులు మెరుస్తూ ఆ పర్వతపు కన్నులవలె నున్నవి.

శ్లో|| తోయౌఘనిస్స్వనైర్మంద్రైః ప్రాధీత మివ పర్వతమ్|
ప్రగీతమివ విస్పష్టైః ర్నానాప్రస్రవణస్వనైః||12||
దేవదారుభిరత్యుచ్చైః ఊర్ధ్వబాహుమివ స్థితమ్|
ప్రపాత జలనిర్ఘోషైః ప్రాకృష్ట మివ సర్వతః||13||

స|| తోయౌఘనిశ్వనైః ప్రాధీతం ఇవ విస్పష్టైః నానాప్రస్రవణ స్వనైః మన్ద్రైః ప్రగీతం ఇవ పర్వతమ్|| అత్యుచ్చైః దేవదారుభిః ఊర్ధ్వబాహుం ఇవ స్థితం | ప్రపాత జలనిర్ఘోషైః సర్వతః ప్రాకృష్టం ఇవ | .

తా|| ఆ పర్వతపు శిలలపై పారుతున్న జలప్రవాహ ధ్వనులు పర్వతము మంత్రములు చదువుతున్నవా అన్నట్లు వినపడుచున్నవి. ఆ పొడుగాటి దేవదారువు వృక్షములు పైకెత్తిన బాహువులలాను ,శిఖరములలో పైనుంచి పడుచున్నజలపాతముల ధ్వనులు గొంతెట్టి అరుస్తున్నవా అన్నట్లు ఉన్నాయి.

శ్లో|| వేపమాన మివ శ్యామైః కంపమానైః శరద్ఘనైః|
వేణుభిర్మారుతోద్దూతైః కూజన్తమివ కీచకైః||14||
నిశ్స్వసన్తమివామర్షాత్ ఘోరైరాశీవిషోత్తమైః|
నీహారకృతగంభీరైః ధ్యాయన్తమివ గహ్వరైః||15||

స|| శ్యామైః కంపమానైః శరద్ఘనైః వేపమానం ఇవ| వేణుభిః కీచకైః మారుతోద్ధూతైఃకీచకైః కూజంతం ఇవ ( అస్తి) ||ఘోరైః ఆశీవిషోత్తమైః నిఃశ్వశంతం ఇవ| నీహారకృత గంభీరైః గహ్వరైః ధ్యాయన్తం ఇవ ||

తా|| నల్లని శరత్కాల మేఘములు ఆ పర్వతమును కదుపుచున్నవా అన్నట్లు ఉన్నాయి. గాలితో కొట్టబడిన వెదురు చెట్లధ్వనులు పర్వతము వేణువు ఊదుచున్నట్లు ఉంది. పర్వతము మీద ఘోర సర్పముల బుసలు పర్వతము నిట్టూర్పులు విడుచుచున్నదా అన్నట్లు ఉన్నవి.

శ్లో|| మేఘపాదనిభైః పాదైః ప్రకాన్తమివ సర్వతః|
జృంభమాన మివాకాశే శిఖరైరభ్రమాలిభిః||16||
కూటైశ్చ బహుధా కీర్ణైః శోభితం బహుకన్దరైః|
సాలతాలాశ్వకర్ణైశ్చ వంశైశ్చ బహుభిర్వృతమ్||17||

స||మేఘపాదనిభైః పాదైః సర్వతః ప్రకాన్తమివ అభ్రమాలిభిః శిఖరైః ఆకాశే జృంభమాణం ఇవ||బహుధా కీర్ణైః బహుకందరైః కూటైశ్చ శోభితం | బహుభిః సాలతాలాశ్వకర్ణైశ్ఛ వంశైశ్చ వ్తతం||

తా|| పాదపర్వతములు పర్వతము మీద సంచరించే మేఘముల పాదాలమల్లే ఉండడముతో, ఆ పర్వతమే నడుచుచున్నదా అన్నట్లు ఉండెను. ఆ పర్వతము అనేక శిఖరములతో గుహలతో శోభించుచుండెను. ఆ పర్వతము సాల తాళ వృక్షములతో దట్టముగా నిండి యుండెను.

శ్లో|| లతావితానైర్వితతైః పుష్పవద్భిరలంకృతమ్|
నానామృగ గణాకీర్ణం ధాతునిష్యన్దభూషితమ్||18||
బహుప్రస్రవణోపేతం శిలాసంచయసంకటమ్|
మహర్షియక్షగంధర్వ కిన్నరోరుగసేవితమ్||19||
లతాపాదసంఘాతం సింహాధ్యుషితకన్దరమ్|
వ్యాఘ్రసంఘసమాకీర్ణం స్వాదుమూలఫలద్రుమమ్||20||

స||వితతైః పుష్పవద్భిః లతావితానైః అలంకృతం నానామృగగణాకీర్ణం ధాతునిష్యందభూషితమ్ ||బహుప్రశ్రవణోపేతం శిలాసంచయసంకటం మహర్షి యక్ష గంధర్వ కిన్నరః ఉరుగః సేవితమ్||లతాపాదపసంఘాతం సింహాధ్యుషితకన్దరమ్ వ్యాఘ్ర సంఘ సమాకీర్ణం స్వాదుమూలఫలాద్రుమమ్||

తా|| ఆ పర్వతరాజము విరబూసిన పుష్పములు కల లతలతో, అనేకరకముల జంతు సమూహములతో, ధాతుస్రవాలతో అలంకృతమై శోభించుచుండెను. అనేక సెలయేళ్ళు ప్రవహిస్తూ సంచారానికి ఆటంకము కలిగించు శిలల గుట్టలతో వున్న ఆ పర్వతము, మహర్షులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, ఉరగములతో సేవింపబడుచుండెను. అనేక లతల వృక్షముల సముదాయముతో అలంకరింపబడిన ఆపర్వతపు గుహలను, సింహములు ఆవాసముగా చేసుకొన్నాయి. పర్వతము మీద వ్యాఘ్రముల సముదాయము సంచరిస్తున్నాయి. ఆ పర్వతము మధురమైన ఫలములతో నిండిన వృక్షములతో నిండియున్నది.

శ్లో|| తం ఆరురోహ హనుమాన్ పర్వతం పవనాత్మజః|
రామదర్శన శీఘ్రేణ ప్రహర్షేణాభిచోదితః||21||
తేన పాదతలాక్రాన్తా రమ్యేషు గిరిసానుషు|
సఘోషాః సమసీర్యన్త శిలాః చూర్ణీకృతాస్తతః||22||

స|| పవనాత్మజః హనుమాన్ రామదర్శన శీఘ్రేణ ప్రహర్షేణ అభిచోదితః తం పర్వతం ఆరురోహ|| తతః రమ్యేషు గిరిసానుషు తేన పాదతలాక్రాంతాః శిలాః సుఘోషాః చూర్ణీకృతాః సమసీర్యన్త||

తా|| పవనాత్మజుడైన హనుమంతుడు శీఘ్రముగా రామదర్శనమునకై ఆతురతో, రామదర్శనము అన్న సంతోషముతో, ఆ పర్వతము ఎక్కెను. అప్పుడు ఆ సుందరమైన పర్వతపు సానువులందు ఉన్న శిలలు హనుమంతుని పాదముల కింద నలిగి పెద్ద చప్పుళ్ళతో చూర్ణమైపోయాయి.

శ్లో|| స తం ఆరుహ్య శైలేంద్రం వ్యవర్థత మహాకపిః|
దక్షిణాదుత్తరం పారం ప్రార్థయన్ లవణాంభసః||23||
అధిరుహ్య తతో వీరః పర్వతం పవనాత్మజః|
దదర్శ సాగరం భీమం మీనోరగనిషేవితమ్||24||

స||సః మహాకపిః లవణాంభసః దక్షిణాత్ ఉత్తరం పారం ప్రార్థయన్ తం శైలేంద్రం ఆరుహ్య వ్యవర్ధత||తతః వీరం పవనాత్మజః పర్వత్ం అధిరుహ్య మీనోరుగనిషేవితం భీమం సాగరం దదర్శ||

తా|| ఆ మహాకపి ఆ సముద్రపు దక్షిణతీరమునుండి ఉత్తరతీరము చేరగోరి ఆ పర్వత శిఖరము ఎక్కి తన శరీరప్రమాణమును మరింత పెంచెను. అప్పుడు ఆ హనుమంతుడు ఆ పర్వత శిఖరముపై నిలబడి మీనములతో సర్పములతో నిండియున్న భయము కొలుపుతున్న సముద్రమును చూచెను.

శ్లో|| స మారుత ఇవాఽకాశం మారుతస్యాఽత్మసంభవః|
ప్రపేదే హరిశార్దూలో దక్షిణాదుత్తరం దిశమ్||25||
స తదా పీడితస్తేన కపినా పర్వతోత్తమః|
రరాస సహ తైర్భూతైః ప్రవిశన్ వసుధాతలమ్||26||
కమ్పమానైశ్చ శిఖరైః పతద్భిరపి చ ద్రుమైః|

స|| మారుతస్య ఆత్మసంభవః సా హరిశార్దూలః దక్షిణాత్ ఉత్తరం దిశం మారుతః ఇవ ఆకాశం ప్రపేదే||స తదా తేన కపినా పీడితః సః పర్వతోత్తమః భూతైః సహ వసుధాతలం ప్రవిశన్ కంపమానైః శిఖరైః పతత్భిః ద్రుమైః రరాస||

తా|| వాయుపుత్రుడు వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు దక్షిణ దిశనుంచి ఉత్తరదిశగా పయనించుటకు వాయువేగముతో ఆకాశము లోకి ఎగిరెను. హనుమంతుడు పైకి ఎగిరినప్పుడు ఏర్పడిన ఒత్తిడికి ఆ పర్వతము అక్కడి ప్రాణులతో సహా భూమిలోకి క్రుంగి పోసాగెను. అప్పుడు పర్వత శిఖరాలు అన్నీ కంపించడముతో వృక్షములు ఆన్ని వేళ్ళతో సహా నేలకూలిపోడముతో, అందుండి బ్రహ్మాండమైన ధ్వని వెలువడినది.

శ్లో|| తస్యోరు వేగోన్మథితాః పాదపాః పుష్పశాలినః||27||
నిపేతుర్భూతలే రుగ్ణాః శక్రాయుధ హతా ఇవ|
కన్దరాన్తరసంస్థానం పీడితానాం మహౌజసామ్||28||
సింహానాం నినదో భీమో నభో భిన్దన్ స శుశ్రువే|

స|| తస్య ఉరువేగాత్ మథితాః పుష్పశాలినః పాదపాః రుగ్ణాః శక్రాయుధహతా ఇవ భూతలే నిపేతుః||కన్దరాన్తర సంస్థానమ్ పీడితాం మహౌజసాం సింహానాం భీమః సః నినాదః నభః భిన్దన్ శుశ్రువే||

తా|| అతని ఊరువుల వేగధాటికి, విరబూసిన పువ్వులతో వున్న వృక్షములన్నీ ఇంద్రుని ఆయుధముతో కొట్టబడినట్లు భూమిపై పడిపోయాయి. గుహలలో ఉండి చిక్కుపడిపోయిన మహాశక్తిమంతమైన సింహముల నినాదముతో ఆకాశము మిన్ను ముట్టినది.

శ్లో|| స్రస్తావ్యావృత్త వసనా వ్యాకులీకృతభూషణాః||29||
విద్యాధర్యః సముత్పేతుః సహసా ధరణీ ధరాత్|
అతిప్రమాణా బలినో దీప్తజిహ్వా మహావిషాః||30||
నిపీడిత శిరోగ్రీవా వ్యచేష్టన్త మహాహయః|

స|| విధ్యాధర్యః త్రస్తవ్యావృతవసనా వ్యాకులీకృత భూషణాః సహసా ధరణీ ధరాత్ సముత్పేతుః||అతిప్రమాణః బలినః దీప్తజిహ్వాః మహావిషాః మహాహయః నిపీడితశిరోగ్రీవాః వ్యచేష్టన్త||

తా|| విద్యాధరులు భయపడినవారై పక్కకి జారిన వస్త్రములతో, అస్తవ్యస్తమౌతున్న ఆభరణాలతో, భూమి నుంచి ఆకాశమునకి వెంటనే కంగారుగా ఎగిరిరి. పెద్ద బలమైన పాములు అ వత్తిడికి నలిగి పోయి మహా విషములను విరజిమ్ముతూ చుట్టలు చుట్టుకోసాగాయి.

శ్లో|| కిన్నరోరగ గంధర్వయక్షవిద్యాధరస్తదా||31||
పీడితం తం నగరం త్యక్త్వా గగనమాస్థితాః|
స చ భూమిధరః శ్రీమాన్ బలినా తేన పీడితః||32||
స వృక్షశిఖరోదగ్రః ప్రవివేశ రసాతలమ్|

స|| తదా కిన్నరోరగ గంధర్వయక్షవిద్యాధరః పీడితం తం నగవరమ్ త్యక్త్వా గగనం ఆస్థితాః||బలినా తేన పీడితః సవృక్షశిఖరోదగ్రః శ్రీమాన్ సః భూమిధరశ్చ రసాతలం ప్రవివేశ||

తా|| అప్పుడు కిన్నర ఉరగ గంధర్వ యక్షులతో కలిసి విద్యాధరులు ఆ హనుమంతుని వత్తిడి చే పీడింపబడుతున్న ఆ పర్వతమును వదిలి ఆకాశములోకి ఎగిరిరి. ఆ బలవంతునిచే నొక్కబడి వృక్షములతో నున్న శిఖరాగ్రములు భూమిలో ఒరిగి పాతాళంలోకి కుంగి పోసాగినవి.

శ్లో|| దశయోజనవిస్తారః త్రింశద్యోజనముచ్ఛ్రితః||33||
ధరణ్యామ్ సమతాం యాతః స బభూవ ధరాధరః|

స|| దశయోజనవిస్తారః త్రింశత్ యోజనం ఉచ్ఛ్రితం ధరాధరః ధరణ్యాం సమతాం యాతః బభూవ||

తా|| పదియోజనముల విస్తారము కల ముప్పది యోజనముల ఎత్తుగల ఆ పర్వతము పూర్తిగా నేలమట్టమయినది.

శ్లో|| స లిలింగ యిషుర్భీమం సలీలం లవణార్ణవమ్||34||
కల్లోలాస్ఫాల వేలాన్త ముత్పపాత నభో హరిః||35||

స|| స హరిః భీమం కల్లోలాస్ఫాలవేలాం తం లవణార్ణవమ్ సలీలం లిలింఘయిషుః నభః ఉత్పపాత||

తా|| ఆ వానరుడు కల్లోలమైన తరంగాలతోవున్న ఆ సముద్రమును అవలీలగా దాటగోరి అకాశములోకి ఎగిరెను

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే షట్పంచాశస్సర్గః ||

ఈ విధముగా వాల్మీకి రచించిన అదికావ్యమైన రామాయణములో సుందరకాండలో ఎబది ఆరవ సర్గ సమాప్తము.

|| om tat sat||